హైదరాబాద్ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం. ఈ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును కీలకమైన నిందితుడిగా పేర్కొన్నారు పోలీసులు. ఈ మేరకు తనపై కేసు కూడా నమోదు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించక పోవడంతో సర్కార్ చేసిన సిట్ ఝలక్ ఇచ్చింది. ఈ మేరకు తనపై లుక్ ఐట్ నోటీసులు జారీ చేసింది. తనకు అనారోగ్యం ఉందంటూ కుంటి సాకులతో అమెరికాలో ఉండే ప్రయత్నం చేశారు ప్రభాకర్ రావు. తమకు అప్పగించాలని కోరుతూ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణకు హాజరు కావాల్సిందేనని, లేక పోతే తీవ్ర చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. దీంతో గత్యంతరం లేక జూన్ 8న ఆదివారం హైదరాబాద్ కు చేరుకున్నారు. తన వెంట 70 మందికి పైగా బౌన్సర్లను పెట్టుకున్నారు. మీడియాతో మాట్లాడకుండానే వెళ్లి పోయారు. 14 నెలల తర్వాత ఇక్కడికి వచ్చారు. తనను విచారణ సందర్భంగా ఎనిమిది గంటలకు పైగా విచారించారు. తిరిగి జూన్ 11న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.
జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టారు. సిట్ అధికారులతో పాటు ఏసీపీ వెంకట గిరి ప్రశ్నలు సంధించారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఫోన్ లను ట్యాపింగ్ చేయించారనేది నిజమేనా అని అడిగారు. దేనికి కూడా ప్రభాకర్ రావు సరిగా సమాధానం చెప్పలేదు. ఈ కుంభకోణంలో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తుల ఫోన్‌లను అనధికారికంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో తనను ఏ1గా పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు సీనియర్ పోలీసు అధికారులు ప్రణీత్ రావు, రాధా కిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నలను విచారించింది.
