ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం థగ్ లైఫ్. ఇందులో ఇలయ నాయగన్ , రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ , సిలాంబరసన్, త్రిష కృష్ణన్ కీలక పాత్రల్లో నటించారు. ఇది జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిశ్రమ స్పందన లభించింది ఈ మూవీకి. ఇప్పటి వరకు రూ. 50 కోట్ల వరకు వసూలు చేసింది. కానీ ఆశించిన మేర వసూళ్లు కాక పోవడంతో కొంత నిరాశకు గురి చేసింది. మణిరత్నం స్థాయిలో చిత్రం లేదని టాక్ వచ్చింది.
ఇదిలా ఉండగా 38 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కమల్ హాసన్ తిరిగి మణిరత్నంతో కలిసి థగ్ లైఫ్ లో నటించాడు. విచిత్రం ఏమిటంటే ఈ సినిమాకు కథ కూడా తనే రాశాడు. ఇందులో పాట కూడా రాయడం విశేషం. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. టీజర్, ట్రైలర్, పోస్టర్స్ కు పెద్ద ఎత్తున బజ్ వచ్చింది. కానీ విడుదల అయ్యాక అంతగా ఆకట్టుకోలేదన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది.
అయితే సినిమా ఈవెంట్ సందర్బంగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో సంచలన కామెంట్స్ చేశారు నటుడు కమల్ హాసన్ . కన్నడ భాష తమిళంలోంచి పుట్టిందని అన్నారు. దీంతో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది కమల్ కామెంట్స్ పై. కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో పాటు బీజేపీ నేతలు, ఎంపీలు సైతం భగ్గుమన్నారు. తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో కర్ణాటక ఫిలిం ఛాంబర్ కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ ను కర్ణాటకలో విడుదల చేసేందుకు వీలు లేదంటూ నిషేధం విధించింది. దీనిపై తీవ్రంగా స్పందించాడు కమల్ హాసన్. తాను అన్న మాటలను వక్రీకరించారంటూ వాపోయాడు. రిలీజ్ చేయాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. థగ్ లైఫ్ ను కర్ణాటకలో రిలీజ్ చేయాల్సిందేనని ఆదేశించింది.
