వైఎస్సార్ కడప జిల్లా – తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే నిలిచి పోయేలా కడపలో మహానాడు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు జిల్లా ఇంఛార్జి మంత్రి ఎస్ .సవిత. సన్నాహక ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఈ మహానాడుకు 5 లక్షల మందికి పైగా హాజరవుతున్నారని, ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు సవిత.
రాయలసీమ నాయకులు తమకు ఇచ్చిన టార్గెట్ మేరకంటే అదనంగా జన సమీకరణ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన ప్రాంత నాయకులు తమ టార్గెట్ మేర జనసమీకరణ చేపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత కోరారు. కడపలో మహానాడు నిర్వహణకు నిర్ణయించిన సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. మహానాడు విజయవంతానికి 13 కమిటీలు నియమించామన్నారు. టీడీపీతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇదే విషయం చరిత్ర చూస్తే తెలుస్తుందని మంత్రి తెలిపారు. మహానాడు వేదికగా రాయలసీమ అభివృద్ధికి సీఎం వరాలు కురిపించే ఛాన్స్ ఉందన్నారు.
అంతకు ముందు పబ్బావరంలో మహానాడు నిర్వహించే ప్రాంతాన్ని మంత్రులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులతో కలిసి మంత్రి సవిత పరిశీలించారు. ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
