హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ తలకు మించిన భారంగా మారింది. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని చావు కబురు చల్లగా చెప్పారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇప్పటి వరకు ఎంపిక చేసిన పదవులన్నీ మాలల సామాజిక వర్గానికే కేటాయించారని, మాదిగల పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నించారు. ఈమేరకు పెద్ద ఎత్తున లేఖలు సంధించారు హైకమాండ్ కు.
ఇటీవలే ఆ పార్టీ తెలంగాణలో పరిస్థితులను చక్క బెట్టేందుకు రాహుల్ గాంధీ దూతను పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా మీనాక్షి నటరాజన్ ను నియమించింది. ఆమె వచ్చినా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ప్రధానంగా ఇటీవల సర్కార్ నియమించిన సమాచార కమిషన్ లో పూర్తిగా నిబంధనలను నీళ్లు వదిలారంటూ బీసీ సామాజిక వర్గం భగ్గుమంటోంది. ఈ తరుణంలో మాదిగలు రాసిన లేఖలు చర్చనీయాంశంగా మారాయి.
తాజాగా మంత్రి పదవి కోసం మాదిగ ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖాస్త్రం సంధించడం కలకలం రేపింది. పదవులన్నింటిని మాలలకు ఇస్తూ తమకు తీరని అన్యాయం చేస్తున్నారంటూ వాపోయారు ఎమ్మెల్యేలు.
హై కమాండ్ కు లేఖ రాసిన వారిలో మాదిగ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, మందుల సామేలు, వేముల వీరేశం, తోట లక్ష్మీకాంత రావు, కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నారు. పార్టీ చీఫ్ ఖర్గేకు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.