ఏ ముహూర్తంలో హరి హర వీరమల్లును ప్రారంభించారో కానీ పడుతూ లేస్తూ వస్తోంది. ఈ సినిమా పూర్తయ్యేందుకు చాలా ఏళ్లు పట్టింది. పవన్ కళ్యాణ్ డేట్స్ కుదరక పోవడం, తను ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో పాటు సినిమాకు కథను కూర్చి, కొంత కాలం పాటు తనతో ట్రావెల్ చేసిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఉన్నట్టుండి సైడ్ అయి పోయాడు. ఎందుకు తప్పుకున్నాడో ఎవరికీ తెలియదు. దానికి గల కారణాలు వెల్లడించలేదు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ చిత్రానికి తదుపరి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు నిర్మాత ఎంఎం రత్నం సోదరుడి తనయుడు జ్యోతి కృష్ణ.
హరి హర వీరమల్లును ఇతిహాస చిత్రంగా రూపొందించే పనిలో పడ్డాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినా ఎందుకనో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఆ తర్వాత వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గతంలోనే నిర్మాత రత్నం కీలక ప్రకటన చేశాడు. భారతీయ సినిమా చరిత్రలో ఇలాంటి మూవీ రాలేదన్నాడు. కానీ చూస్తే వాయిదా వేయడం పట్ల ఫ్యాన్స్ ఒకింత నిరాశకు గురయ్యారు. జయాపజయాలతో పని లేదు పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తే.
తనకు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. వాళ్లంతా పవర్ స్టార్ కోసం ఏమైనా చేస్తారు. ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించగానే ఏపీ, తెలంగాణకు చెందిన సినిమా డిస్ట్రిబ్యూటర్స్ , ఎగ్జిబిటర్స్, నిర్మాతలు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. థియేటర్లను బంద్ చేస్తామని ప్రకటించారు. దీంతో పవన్ కన్నెర్ర చేశాడు. ఆ తర్వాత గొడవ సద్దు మణిగింది. ఇదే సమయంలో సంచలన ప్రకటన చేశాడు పవన్. తనకు రెమ్యునరేషన్ కింద ఇచ్చిన రూ. 11 కోట్లను తిరిగి నిర్మాత ఎంఎం రత్నంకు ఇస్తున్నట్లు వెల్లడించాడు అధికారికంగా. మరి సినిమా వస్తుందా రాదా అన్నది తేల్చాల్సింది నిర్మాతనే.