బాబూ చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తే ఎలా..?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్

అమ‌రావ‌తి – ఏపీలో శ‌వ రాజ‌కీయాల‌కు సీఎం చంద్ర‌బాబు నాయుడు తెర లేపారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. తాను అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌గ‌ల‌రా అంటూ నిప్పులు చెరిగారు. నా ప‌ర్య‌ట‌న‌కు ఎందుకు ఆంక్ష‌లు పెట్టాల్సి వ‌చ్చిందో చెప్పాల‌న్నారు. ఎందుకు క‌ట్ట‌డి చేశారు. గ‌తంలో మీరు కానీ, లేదా మీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కానీ తిరుగుతుంటే మేమైనా ఇలాంటి ఆంక్ష‌లు పెట్టామా అని నిల‌దీశారు. ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా? అని అన్నారు జ‌గ‌న్ రెడ్డి.

ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా, మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా, ఆటోమేటిక్‌ హక్కు కాదా అని ప్ర‌శ్నించారు. మీకు బుద్ధిపుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే, మూడ్‌ రానప్పుడు మేం మీకు జడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీని విత్ డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా? అని అన్నారు.

జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారని తెలిపారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులు అయినా జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను ఫాలో అయ్యి, ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ సీఎంకి కల్పించాల్సి ఉంటుంద‌న్నారు.

ఇది నాకైనా, మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రొటోకాల్‌. మరి జడ్‌ప్లస్‌ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే, తన ప్రోగ్రాంకు సంబంధించి రూట్‌మ్యాప్‌ ఇచ్చిన తర్వాత, పైలట్‌ వెహికల్స్‌, రోప్‌ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో భాగమైనప్పుడు, మరి మీ రోప్‌ పార్టీల, జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్‌పట్టుకుని, ఎవ్వరూ వాహనంమీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

గతంలో మీరు ఇంటింటికీ పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయట పెడితే, మీ పాలనా వైఫల్యాలను, రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్‌పోజ్‌ చేస్తే, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా రాష్ట్ర ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతల మవుతున్న రైతులు, అక్క చెల్లెమ్మలు, పిల్లల బ్రతుకులు, వీటన్నింటినీ నేను చెబితే, వాటికి సమాధానం చెప్పలేక, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నామీద ప్రేమను చూసి తట్టుకోలేక, మీరు దిగజారి డైవర్షన్‌ రాజకీయాలు చేయ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com