అమరావతి – మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. ముఖ్యమంత్రికి మతి లేకుండా పోతోందన్నారు. కూటమి సర్కార్ వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ప్రజలకు అందుతున్న సేవలపై ఎందుకు కక్ష కట్టారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలికానీ, వారిని కష్టపెట్టడం సబబేనా అని నిలదీశారు.
ప్రభుత్వ సేవల డోర్ డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా? మరోవైపు వైయస్సార్‌సీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్ట కొట్టడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం అని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ రెడ్డి.
ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? పారదర్శకంగా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందిస్తూ, వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాలను తొలగించడం సరైనదేనా? పైగా ఈ సేవలందించిన వారిని ఉద్దేశిస్తూ వారు స్మగ్లర్లుగా, మాఫియా ముఠా సభ్యులుగా చిత్రీకరించేలా నిన్న మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరిగా లేవన్నారు.
ఇంటి వద్దకే రేషన్ అందించే డోర్‌డె లివరీని ప్రారంభించామన్నారు. బియ్యం క్వాలిటీని పెంచి, సన్న బియ్యాన్ని, ప్రజలు తినగలిగే నాణ్యమైన, సార్టెక్స్ చేసిన బియ్యాన్ని ప్యాక్‌చేసి, రేషన్ వాహనాల ద్వారా ప్రతి ఇంటింటికీ అత్యంత పారదర్శకంగా అందించి దోపిడీకి అడ్డుకట్ట వేశామన్నారు.
నెలకు రూ.10 వేలు ఇస్తామంటూ వాలంటీర్లను మీ వైపు తిప్పుకుని ఎన్నికల్లో వాడుకుని, తీరా అధికారంలోకి వచ్చాక పచ్చి అబద్ధాలు ఆడుతూ వారిని రోడ్డుమీద నిలబెట్టారని ఆరోపించారు. హేతుబద్ధీకరణ పేరుతో గ్రామవార్డు సచివాలయాలపై కక్ష కట్టి అందులో ఉన్న 33వేల శాశ్వత ఉద్యోగాలకు శాశ్వతంగా సమాధి కట్టడం ఎంత వరకు సబబు అని నిలదీశారు.
